తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80 వేల కోట్లతో నిర్మించామని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో చేసిన అప్పుల వివరాలను సీఎం వెల్లడించారు.
కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందులో రూ. 79,287 కోట్ల రూపాయల విడుదలయ్యాయని వివరించారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసిందని, ఈ అప్పులన్నీ కాళేశ్వరం కోసం చేసినవే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో ఏటా రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథ నీళ్లు అమ్మడం ద్వారా రూ. 5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పారని గుర్తుచేశారు. లాభాలు వస్తున్నప్పుడు తిరిగి చెల్లిస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలు సభలో త్వరలోనే స్పష్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.