contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ ఫామ్ హౌస్‌లను కూల్చవద్దా?: రేవంత్ రెడ్డి

కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయవద్దా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో కలుస్తోందని, ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… వారి ఫామ్ హౌస్‌లను కూల్చుతామనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు… మీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని, డిసెంబర్‌లోపు మరో ముప్పై వేలమందికి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్, వరద సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బావ, బావమరిది తమపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిరాయి మనుషులతో వారు చేసే హడావుడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు రూ.1,500 కోట్లు వారి పార్టీ ఖాతాలో ఉన్నాయని, వాటి నుంచి రూ.500 కోట్లు మూసీ పరివాహక ప్రాంత పేద ప్రజలకు పంచి పెట్టాలని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పులు కూడా లేని వారికి, ఇప్పుడు వారి పార్టీ ఖాతాలోకి మాత్రం రూ.1,500 కోట్లు వచ్చాయని విమర్శించారు.

హైడ్రా విషయమై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ రోజే సూచనలు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చెప్పాలని, వినేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 15 వేల మందికి ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

హైడ్రా విషయమై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చి సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే చిన్నపాటి వర్షానికే మునిగిపోతోందని, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సచివాలయానికి వస్తే చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈటల రాజేందర్ నేతృత్వంలో నిధుల కోసం ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళదామని సూచించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రావాలన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం

సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రేషన్ కార్డు కోసం గత పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు.

సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డిజిటల్ కార్డులు అవసరమన్నారు. ప్రతి పేదవాడికి కార్డును అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ తదితర అవసరాలకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :