హైదరాబాద్ : “విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను… ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నాను… మోసగాళ్ళ మాటలు విని మోసపోవద్దు. అలాగే పోలీసులు కూడా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దని కోరుతున్నాను” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… తరుచూ పరీక్షలు వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. అభ్యర్థులు గతంలో పరీక్షల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ తిరిగే వారన్నారు.
కానీ వాయిదాలు వేయడం వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు తాము సమయానికి నోటిఫికేషన్ ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తున్నామని, కాబట్టి కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. నోటిఫికేషన్ ఇచ్చాక నిబంధనలు మార్చితే కోర్టులు కొట్టి వేస్తాయన్నారు. జీవో 55 ప్రకారం వెళితే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేదన్నారు.
ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో నిరుద్యోగులను వీళ్లు ఎప్పుడైనా కలిశారా? అశోక్ నగర్ వచ్చి మాట్లాడారా? ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పరీక్షల నిర్వహణ విధానాన్ని హైకోర్టు సమర్థించిందన్నారు.