ప్రకాశం జిల్లా చీమకుర్తి క్రిస్టియన్ పాలెం మాదిగల స్మశాన వాటిక, వాగు పోరంబోకు స్థలం అక్రమానికి గురైన విషయం తెలిసిందే. అక్కడి స్థానికులే కొంతమంది స్మశాన భూమిని సైతం వదలకుండా పశుగ్రాస పెంపకం కూడా చేయసాగారు. సుమారు 4.56 ఎకరాల స్మశానం మరియు వాగు పోరంబోకు స్థలాన్ని చనిపోయిన శవాలను పూడ్చేందుకు సెంటు భూమి కూడా లేకుండా ఆక్రమించిన పరిస్థితి. గత ప్రభుత్వం లోని స్థానిక నాయకుల అండతో భూభకాసురులు, అధికారుల ప్రమేయంతో కొంత భాగాన్ని ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సదరు స్మశాన వాటిక, వాగు పోరంబోకు స్థలానికి సంబంధించిన సమాచారం యొక్క పత్రాలను స్థానికులు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారుల నుండి సేకరించి చీమకుర్తి నగరపాలక సంస్థ కమిషనర్, తాసిల్దారును కలిసి తమకు కేటాయించిన స్మశానం మరియు వాగు పోరంబోకు స్థలాన్ని, అక్రమణదారుల నుండి కాపాడాలని , జంగిల్ క్లియరెన్స్ చేసి, రీ సర్వే జరిపించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి సదరు భూమికి కబ్జాల నుండి భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాటిపండ్ల బిక్షాలు, కర్ణ ప్రసాదు, ప్రేమ్ కుమార్, పాకాల శ్రీను, పోలరాజు, పాటిబండ్ల జక్రయ్య, వంశి, శివ,మల్లవరపు రాజు, మరియదాసు, బక్క యెహోషువ, ఇంజాపల్లి యోహాను, కోటయ్య, యోహాను MRPS నాయకులు జడ విజయ్ కుమార్ మరియు క్రిస్టియన్ పాలెం యువత పాల్గొన్నారు.