ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తి మండల గ్రానైట్ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆర్.కృష్ణయ్య , స్థానిక శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం రామతీర్థం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో గ్రానైట్ క్వారీల, ఫ్యాక్టరీల, పాలిషింగ్ యూనిట్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వేల మందికి ఉపాధిని కల్పించే గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, గ్రానైట్ పరిశ్రమల నుండి వెలువడే దుమ్ము ,ధూళి వలన జరిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు నివారణ చర్యలు, అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ వనరులను ఏర్పాటు చేయాలని తెలియజేశారు.
స్థానిక ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమలు ప్రసిద్ధిగాంచినవని, గ్రానైట్ పరిశ్రమల ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుందని, పరిశ్రమల వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా అడుగులు వేస్తూ, పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతూ, ఖనిజాభివృద్ధి సంస్థ లో ఉన్న 120 కోట్ల రూపాయలనిధుల ద్వారా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక గ్రానైట్ వ్యాపారులు, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, స్లాబ్ పాలిషింగ్ యూనిట్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.