జాబ్ క్యాలెండర్ ను త్వరలోనే తీసుకువచ్చి నిర్దిష్టమైన గడువు లోపు ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ రోజు జరిగిన ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ రోజు జరిగిన ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం పాల్గొన్నారు. వారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే దాదాపు 60 వేల ఉద్యోగ నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామన్నారు.