మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని బీఆర్ఎస్ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నాళ్లీ దొరతనమని ప్రశ్నించారు.
‘ఎవడయ్యా ఆ వెంకట్రామిరెడ్డి? ఏ ఊరి వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం పెట్టిండి మీకు? మల్లన్న సాగర్‌లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్‌లో మిమ్మల్ని పాతరేసినోడు కాదా? వేలాదిమంది పోలీసులను దించి ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్నసాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్లు చూసి… బందిపోట్ల దొంగల్లా రైతులకు బేడీలు వేసి పట్టుకొని పోలేదా? ఏటిగడ్డ కిష్టాపూర్, మల్లన్నసాగర్ రైతులు ఈ విషయం మరిచిపోయారనుకుంటున్నారా?
కేసీఆర్, హరీశ్ రావు ఏం చూసి ఆయనకు టిక్కెట్ ఇచ్చారు? నగదే కదా… ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకొని… మీ భూముల మీద వ్యాపారం చేసి… మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి… మీ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్న వాడు ఎవడయ్యా… వెంకట్రామిరెడ్డి కాదా? వారి కంపెనీ పేరు రాజ్ పుష్ప కాదా? కూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి… కలెక్టర్‌గా ఉండి మీ ఉసురు తీసినోడు… మిమ్మల్ని హింసించినోడు… మిమ్మల్ని చెట్టుకొకరిని కట్టి కొట్టినవాడు.. నాడు నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎట్లనో… ఈ కేసీఆర్, హరీశ్ వద్ద వెంకట్రామిరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా? ఇవాళ అలాంటి వాడిని కరీంనగర్ నుంచి దించి మీ వద్ద ఎంపీగా నిలబెడితే… మీరు అమాయకులా… మీకు ఆలోచన లేదా? ఇంతపెద్ద మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో నిలబెట్టగలిగే ఒక్క సన్నాసి లేడా? అని నేను అడుగుతున్నాను. ఈ సన్నాసులు.. ఈ సోయిలేనోళ్లు… ఈ దద్దమ్మలు.. ఈ నీచులు మీమీద పెత్తనం చేస్తున్నారు.. అలాంటి వెంకట్రామిరెడ్డికి డిపాజిట్ గల్లంతు చేయాలని సిద్దిపేట సోదరులను అడుగుతున్నాన’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రంగనాయకసాగర్‌లో మీ భూములు గుంజుకొని రంగనాయకసాగర్‌లో ఫామ్ హౌస్ కట్టుకున్నోళ్లు మీకు కావాలా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కౌన్సిలర్‌గా నామినేషన్ వేయాలన్నా, సర్పంచ్‌గా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యేగా నిలబడాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. సిద్దిపేటను 45 ఏళ్లుగా పాపాల భైరవుల్లా మామ, అల్లుడు పట్టి పీడిస్తున్నారని విమర్శించారు. వారి నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించేందుకే తాను వచ్చానన్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు. సిద్దిపేట గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురువేయకపోతే శాశ్వతంగా బానిసత్వంలోకి వెళతామని హెచ్చరించారు. మొదటిసారి ఇక్కడ గడీల పాలనను బద్దలు కొట్టే అవకాశం వచ్చిందన్నారు.