హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో హైడ్రామా క్లైమాక్స్‌కు చేరింది. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు అంటూ సీనియర్లు విమర్శలు చేయడంతో రేవంత్ రెడ్డి వర్గం పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. సీనియర్ల విమర్శలకు సమాధానంగా 12 మంది నేతలు తమ రాజీనామా లేఖను ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు పంపించారు. తమ పదవులను పదవులు రానివారికి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు.
రాజీనామా అనంతరం ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం తాము కాంగ్రెస్‌లోకి రాలేదని సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చామని తెలిపారు. తమను విమర్శిస్తున్న సీనియర్లు ఆలోచించుకోవాలని సూచించారు. పార్టీలో బ్లాక్‌మెయిల్ చేస్తున్నవారు కూడా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, రాహుల్ గాంధీ ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
తమ వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగకూడదనేదే తమ ఉద్ధేశ్యమని సీతక్క అన్నారు. పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. మా పదవులు సీనియర్లకు ఇబ్బంది అన్నందుకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సీనియర్లపై బహిరంగ విమర్శలు చేయదలచుకోవడం లేదని తెలిపారు. నిఖార్సయిన కాంగ్రెస్ వాదులంతా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోయారని… కానీ తాము కాంగ్రెస్‌లోకి వచ్చాక పార్టీ ప్రతిపక్షంలో వుందన్నారు.