మాజీ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లినా మహేశ్ గౌడ్ దే బాధ్యత అని పేర్కొన్నారు.
మునుగోడు ఓటమిపై పీసీసీ జూమ్ మీటింగ్ కు ఆహ్వానం పంపడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసేంది వంద శాతం తప్పు అని, జూమ్ మీటింగులు పెట్టడం సరికాదని అన్నారు. ఇదేమైనా కంపెనీ అయితే ఇళ్లలో కూర్చుని మాట్లాడుకోవచ్చని, ఇది పార్టీ అని పేర్కొన్నారు.
మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అందరూ గాంధీభవన్ లో సమావేశమై చర్చించేలా రేవంత్ రెడ్డి చూడాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనని, అందులో తనకు కూడా బాధ్యత ఉందని, సరిదిద్దుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
నాలుగు నెలలుగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరపలేదని ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పు అని స్పష్టం చేశారు. పాదయాత్రలో వన్ మ్యాన్ షోలా? అంటూ రేవంత్ తీరును పరోక్షంగా ఎత్తిచూపారు.