- వాగు వస్తే చాలు సిద్దిపేట,కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు రాకపోకలు బంద్.
- గతేడాది వరదలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయిన వైనం.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంభీరావుపేట- లింగన్నపేట గ్రామాల మధ్య గల లింగన్నపేట వాగు పై చేపట్టాల్సిన బ్రిడ్జి పనులు మొదలు పెట్టకపోవడం పై శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాల నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ అంతేకాకుండా మరి ముఖ్యంగా గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ పదేపదే సిరిసిల్ల నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చిందని ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశాను అని చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఈ వాగును చూస్తే అర్థమవుతుందని హమీద్ ఎద్దేవా చేశారు.కామారెడ్డి సిద్దిపేటకు, సిరిసిల్ల జిల్లాకు రవాణా మార్గమైనటువంటి ఈ బ్రిడ్జిని నేటి వరకు పూర్తి చేయకపోవడం కేటీఆర్ నిర్లక్ష్యానికి అసమర్ధతకు నిలువుటద్దమని తెలిపారు. గడిచిన 9 సంవత్సరాల లో కేటీఆర్ ఈ మండలానికి ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాల్సిందిగా డిమాండ్ చేశారు.సెస్ ఎన్నికల ముందు హడావుడిగా బ్రిడ్జి సాంక్షన్ అయినట్టు జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఎన్నికలు ముగియగానే ఆ బ్రిడ్జి విషయాన్ని మరిచిపోయారని ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న అని ఓడ దిగాక బోడ మల్లన్నట్టు ఉన్నట్టుంది వ్యవహారం కేటీఆర్ ది అని దుయ్యబట్టారు.తనకు సిరిసిల్ల నియోజకవర్గ మీద ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి తెలుస్తుందని తెలిపారు. గత ఏడాది ముందు నర్మాల ఎగువ మానేరు నిండు కుండల నిండి పరవళ్లు తొక్కుతూ వరద నీరు గంభరావుపేట లింగన్నపేట రహదారిపై వెళ్లడంతో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడైనా వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి నర్సింలు, రాజబోయిన లచ్చయ్య,ఏడబోయిన ప్రభాకర్, జంగం రాజు,అప్సర్, దమ్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.