కరీంనగర్ జిల్లా: కమిషనరేట్ లో డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సర కోసం జరుపుకునే వేడుకల సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా రేపు అనగా 31 వ తేదీ మంగళవారం సాయంత్రం 06:00 గంటల నుండి జనవరి 01వ తేదీ బుధవారం ఉదయం 05:00 గంటల వరకు కరీంనగర్ పట్టణ శివారులోని తీగల వంతెన మరియు లోయర్ మానేరు డాం కట్టపైకి వెళ్ళుటకు అనుమతించబోమని, అక్కడ వేడుకలు నిర్వహించుట నిషేదించడమైనదని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐ.పి.ఎస్. సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్నీ గమనించి ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అంతేకాకుండా రోడ్లమీద కూడా ఎటువంటి వేడుకలు నిర్వహించుటకుగాని, డీజే లను వినియోగించడం నిషేదాజ్ఞలు ఉన్నాయన్నారు.
బైక్ సైలెన్సర్లను మార్చి శబ్దకాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మద్యం సేవించి వాహనము నడుపుతూ పట్టుబడినా, ఎవరైనా ముందస్తు అనుమతులు లేకుండా జనసముహముగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా లేదా చట్ట వ్యతిరేక,అసాంఘీక కార్యకలాపాలు లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చాలా కఠినంగా వ్యవహరించడంతోపాటు నూతన చట్టాలకనుగుణంగా పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో చట్ట పరిధిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.