తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కృష్ణానది జలాల్లో ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. మన ముఖ్యమంత్రి జగన్ దద్దమ్మ కాబట్టే రాష్రానికి పదేపదే అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొందని… పంటలు కూడా వేయలేని స్థితిలో రైతులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు.
రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల్లో నీరు లేదని… ఆయకట్టు ప్రాంతాల్లోని అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి ఏమయ్యారని… కరవు ప్రాంతాల్లో వారు ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులంతా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని… ప్రజలను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరని విమర్శించారు. రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు వద్దని ప్రజలంతా డిసైడ్ అయ్యారని చెప్పారు.