- 14 నుండి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి
తిరుపతి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను అధాని లాంటి వ్యక్తులకు కట్టబెడుతూ ప్రభుత్వ సంస్థలను నరేంద్ర మోడీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి మన వాదాన్ని తెరపైకి తీసుకువచ్చే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇడి, సిబిఐ సంస్థలను మోడీ తన గుప్పెట్లో పెట్టుకొని 300 అక్రమ కేసులు బనయించారని ఇందులో కేవలం 9 కేసులలో మాత్రమే శిక్ష పడిందని చెప్పారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని లొంగిపోతే వారిపై కేసులు కొట్టివేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడులు చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదని నల్లధనం తీసుకురాలేదని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలలో హంద్రీనీవా గాలేరి నగరి సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టుల పనులు ఏమాత్రం జరగలేదన్నారు. టిట్కో ఇండ్లను జగన్మోహన్ రెడ్డి తక్షణం లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపై 14వ తేదీ నుండి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతుందని రాజ్యాంగానికి తూర్పు పొడుస్తోందని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యవసర ధరలతో పాటు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. 14 నుండి జరిగే ప్రచార యాత్రలను జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నదియా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, జయ చంద్ర, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.