- విద్యుత్ చార్జీల పెంపు మోయలేని భారంగా తయారైంది …
- ప్రజలు తిరగబడితే తప్ప పరిష్కారం లేదు
- సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు.
- తిరుపతి నగరంలోని వివిధ కాలనీలలో క్షేత్రస్థాయిలో సిపిఎం పరిశీలన
- విద్యుత్ భారాలపై తీవ్రంగా స్పందిస్తున్న ప్రజలు
తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ భారాలు మోయలేని విధంగా తయారయ్యాయని సిపిఎం మాజీ ఎంపీ, పెనుమల్లి మధు అన్నారు. పెంచిన విద్యుత్ భారాలపై ఆదివారం తిరుపతిలోని సుందరయ్య నగర్ లో పర్యటించి… పెంచిన కరెంటు బిల్లులపై ప్రజల అభిప్రాయాలను మధు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పి. మధు మాట్లాడుతూ ప్రతి ఇంటికి రూ. 300 నుండి రెండు వేల రూపాయల వరకు కరెంట్ బిల్లులు పెరిగాయని అన్నారు. ట్రూ అప్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఫిక్స్ డ్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోయలేని విధంగా వేయడం తగదని అన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతుంటే, దొంగ చాటున కరెంట్ ఛార్జీలు పెంచడం అన్యాయం అన్నారు. వ్యవసాయ పంప్ సెట్ లకు మీటర్లు బిగించి రైతుల పై భారాలు మోపడమే కాకుండా, ఉచిత విద్యుత్తుకు మంగళం పాడుతున్నారని, తద్వారా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులతో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్ కాలనీవాసులు పలువురు తమ బిల్లులను తెచ్చి మధుకు చూపారు. లక్ష్మీదేవి అనే మహిళ మాట్లాడుతూ గతంలో తమకు రూ.300 బిల్లు వచ్చేదని గడచిన నెలలో రూ.2000కి చేరుకుందని ఆవేదనతో తెలిపారు. కాలనీలోని పలువురు ప్రజలు ఐదు నెలలకు రావలసిన బిల్లు ఒక్క నెలకే వచ్చిందని, పెరిగిన తమ బిల్లులను ప్రదర్శిస్తూ మధుకి వివరించారు. పెరిగిన కరెంటు చార్జీలపై తిరగబడాలని మధు ప్రజలకు పిలుపునిచ్చారు. ఊరుకుంటే ధరలు తగ్గవని, తిరగబడి ఏలికలకు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, సిపిఎం నాయకులు టి. సుబ్రమణ్యం, ఎస్ జయచంద్ర, ఎం మాధవ్, పి. సాయి లక్ష్మి, ఆర్. లక్ష్మి, ఎం. నరేంద్ర, కే వేణు, పి. ముని రాజా, జి చిన్న బాబు, పి బుజ్జి, పి. చిన్నా, ఎం. జయంతి, పి రమేష్, రామ్మూర్తి, గంగులప్ప, రాజు, తంజావూరు మురళి, సుందరయ్య నగర్ లోని పలువురు సిపిఎం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు .