- ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఎం వినతి
కాకినాడ, జూలై 22; అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఎం కాకినాడ నగర నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం నగర సీనియర్ నాయకులు కె. సత్తిరాజు మాట్లాడుతూ నూతనంగా అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం హామి ప్రకారం పెన్షన్ 4000రూ కి పెంచడం ఏప్రిల్, మే, జూన్ నెలల ఎరియర్ తో సహా జూలై లో 7000 రూ. అందించడం అభినందనీయమన్నారు. అయితే ఇటీవల అనేక మంది అర్హులైన వారు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పెన్షన్ లబ్దిదారులు మరణిస్తే వారి కుటుంబం లో అర్హులకు మరుసటి నెలలోనే పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం ఉండాలన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన పెన్షన్లు పరిష్కారం జిల్లాలోనే జరిగే ఏర్పాటు చేయాలన్నారు. ఒంటరి మహిళల పెన్షన్ వయోపరిమితి 50 నుండి 35 ఏళ్ళకు తగ్గించాలన్నారు. రేషన్ కార్డులలో పిల్లలు ఉండడం వల్ల కూడా పెన్షన్ సమస్యలు తలెత్తుతున్నాయని, అటువంటి సమస్యలు పరిష్కరించి, అర్హులైన వారందరికీ పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం కోరుతుందన్నారు. వినతి పత్రం తీసుకున్న డిఆర్ఓ తిప్పే నాయక్ వెంటనే డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ రమణి ని పిలిచి వివరణ కోరగా ప్రభుత్వం లాగిన్ ఓపెన్ చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె. సత్తిరాజు తో పాటు సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ మరియు అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.