హత్యాయత్నం కేసులో నిందితులు రెండేళ్ల తర్వాత హత్య కేసు ముద్దాయిలుగా మారిపోయారు. ఎందుకంటే… రెండేళ్ల కిందట దాడిలో గాయపడిన బాధితుడు సుదీర్ఘకాలం మృత్యువుతో పోరాడి ఇటీవల మృతి చెందాడు. దీంతో కేసును హత్య కేసుగా మార్చినట్టు రాజేంద్రనగర్ ఇన్స్ పెక్టర్ క్యాస్ట్రో మీడియాకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెంకు చెందిన వెంకటేశ్ గౌడ్ డిగ్రీ వరకూ చదివాడు. ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధమవుతూ చదువు ఖర్చుల కోసం రాత్రివేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు.
ఆ క్రమంలో 2022 జూలై 31వ తేదీ రాత్రి వెంకటేశ్ గౌడ్ క్యాబ్ ను ఉప్పర్ పల్లికి చెందిన వివేక్ రెడ్డి ఎక్కాడు. అయితే వివేక్ రెడ్డి క్యాబ్ లో నిర్ణీత దూరం దాటి కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ గౌడ్ అదనంగా రూ.200 లు ఇవ్వాలని కోరాడు. అయితే ఈ రూ.200 ల విషయంలో వివేక్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్ మధ్య ఘర్షణ జరిగింది.
క్యాబ్ డ్రైవర్ పై కోపంతో వివేక్ రెడ్డి తన స్నేహితులను రప్పించాడు. మద్యం మైకంలో ఉన్న వివేక్ రెడ్డి స్నేహితులు డ్రైవర్ వెంకటేశ్ గౌడ్ ను విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ రెడ్డి కోమాలోకి వెళ్లాడు. దీంతో వివేక్ రెడ్డి సహా 15 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
రెండేళ్లుగా ఆసుపత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్న వెంకటేశ్ గౌడ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. నిన్న ఈ సమాచారం పోలీసులకు అందడంతో, తాజాగా నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.