ఐపీఎల్ టోర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో క్రికెట్ బెట్టింగ్ విపరీతంగా పెరిగింది. అయితే ఈ క్రికెట్ బెట్టింగ్ కారణంగా చాలామంది డబ్బులు కోల్పోవడమే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బెట్టింగ్ పేరుతో మొదటగా బాగా డబ్బులు సంపాదించిన కొంతమంది యువత… ఆ తర్వాత బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇంకా సంపాదించాలనే ఉద్దేశంతో అప్పులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు యువత. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ లో అప్పుల పాలై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై… ఆ యువకుడు తనువు చాలించాడు. క్రికెట్ బెట్టింగ్ లో ఏకంగా 40 లక్షలు నష్టపోయాడట సదరు వ్యక్తి. మృతుడు రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇక మృతుడికి ఇటీవల వివాహం కాగా ఐదు నెలల పసిపాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.