జగిత్యాల : క్రిప్టో బిజినెస్ పేరుతో సుమారు రూ.70 లక్షల వరకు రాకేశ్ అనే వ్యక్తి పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలకు చెందిన రాకేశ్ తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7 లక్షలు పెట్టించాడని, మిగతా కొందరితో రూ.70 లక్షల వరకు పెట్టుబడులు పెట్టించారని వారు వాపోయారు.
పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో వారంతా రాకేశ్ ను నిలదీశారు. దాదాపు 8 నెలలుగా రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాధితులు కొందరు రాకేశ్ ఇంటి వద్దకు వెళ్లగా, అతను లేకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులు 100కు డయిల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఫిర్యాదు ఇవ్వాలని బాధితులకు సూచించారు.
విషయం తెలియడంతో రాకేశ్ వెంటనే బాధితులతో మాట్లాడాడు. కొంత సమయం ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. డబ్బులు అడిగినప్పుడల్లా ఇలానే రాకేశ్ దాటవేస్తూ వస్తున్నాడని బాధితులు ఆరోపించారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదు.