భద్రాచలం, చర్ల : మిస్ ఫైరింగ్ జరగడంతో బుల్లెట్ ఛాతిలోకి దూసుకుపోయి సీఆర్పీఎఫ్ అధికారి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతమైన పూసుగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపులో సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న శేషగిరిరావు తమ సిబ్బందితో కలిసి పోలీస్ క్యాంపు నుండి విధి నిర్వహణలో భాగంగా పోలీస్ క్యాంపునకు కిలోమీటర్ దూరంలో గల పాత పూసుగుప్ప గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో గల బ్రిడ్జి వద్ద తన ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో తిరిగి పైకి లేచి తన తుపాకిని సరి చేసుకుంటుండగా మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ ఛాతిలోకి దూసుకు వెళ్లినట్లు తెలిసింది.
సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఆయనను భద్రాచలం తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాకు చెందిన శేషగిరిరావు సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా సంవత్సరం కాలంగా మండలంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.