- శుక్రవారం నాడు పదవీవిరమణ చేయనున్న ఏబీ వెంకటేశ్వరావు
- పోస్టింగ్ ఇవ్వాలంటూ నేడు హైకోర్టు ఆదేశాలు
- వెంటనే క్యాట్ ఉత్తర్వులు, హైకోర్టు తీర్పు కాపీని సీఎస్ కు అందించిన ఏబీ
- ఈ విషయాన్ని పరిశీలిస్తానన్న సీఎస్ జవహర్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సస్పెన్షన్ కు గురైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు రేపు శుక్రవారం నాడు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. క్యాట్ ఉత్తర్వులు, తదుపరి హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్ ను కోరారు. ఏబీ వెంకటేశ్వరావు నుంచి క్యాట్ ఉత్తర్వులు, హైకోర్టు తీర్పు కాపీని అందుకున్న సీఎస్ జవహర్ రెడ్డి… తాను ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.