టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిందని భావిస్తున్న యత్నంపై ప్రత్యేక దర్యాప్తునకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఈ కేసుపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరునాడే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేయనుందని సర్కారు తన ఉత్తర్వుల్లో తెలిపింది. సిట్ లో సీవీ ఆనంద్ తో పాటు ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులను నియమించింది. సిట్ సభ్యుల్లో నల్లగొండ ఎస్పీ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ కపిలేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.