పగలేమో సాధారణ పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నట్లు చక్కగా నటిస్తూ రాత్రిపూట చట్టవ్యతిరేక పనులు చేస్తున్న పలువురు యువకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధానిలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగిపోతుండడంతో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేరస్థులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీశారు. నగరంలో పలుచోట్ల నిఘా పెట్టి ఆయుధాల దందా చేస్తున్న 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో క్లీనర్ గా పనిచేస్తున్న యువకుడు, సెలూన్ లో బార్బర్ గా పనిచేస్తున్న మరో యువకుడు, ఓ పెయింటర్, ఓ రైతు, విద్యార్థి, మరో సేల్స్ మెన్, సెక్యూరిటీ గార్డ్.. ఆయుధాల అమ్మకం సాగిస్తున్న ముఠాలోని సభ్యులు. రోజంతా తమ ఉద్యోగాలు చేసుకుంటూ సాధారణంగా కనిపించే ఈ యువకులు ఈజీ మనీ కోసం రాత్రి పూట ఆయుధ వ్యాపారులుగా అవతారమెత్తుతున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో ఏసీపీ అర్వింద్, ఎస్ఐలు మంగేష్ త్యాగి, రాబిన్ త్యాగి దర్యాఫ్తు జరిపారు. ‘ఆపరేషన్ ఈగిల్’ పేరుతో దర్యాఫ్తు జరిపి ఆయుధాల వ్యాపారుల గుట్టును తేల్చేశారు. మొత్తం 18 మంది యువకులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, నాటు తుపాకులు, రైఫిల్, కాట్రిడ్జ్ లు, దొంగిలించిన కారును స్వాధీనం చేసుకున్నారు.