రాజ్యసభలో ఓ సభ్యుడి సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట లభ్యం కావడంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ విచారణకు ఆదేశించడం తీవ్ర కలకలం రేపింది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సంఘ్వీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 9వ రోజైన శుక్రవారం ప్రారంభమయ్యాయి. 11 గంటలకు మొదలయ్యాయి. రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాక చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటులో నగదు గుర్తించామని వెల్లడించారు. కరెన్సీ నోట్లు దొరికాయని తెలిపారు. పార్లమెంట్ భద్రతా అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిన్న సభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో నగదు పట్టుబడిందని, ప్రస్తుతం అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో విచారణ జరుతుందని, ఈ మేరకు ఆదేశించానని ధన్‌ఖడ్ చెప్పారు.
ధన్‌ఖడ్ చేసిన ఈ ప్రకటనపై విపక్ష కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నిరసనలకు దిగారు. విచారణ జరపకుండానే ఇలా పేరు ప్రకటించడం ఏమిటిని ప్రశ్నించారు. సభా చైర్మన్ స్థానంలో కూర్చొని ఈ విధంగా ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
సభకు ఒక రూ.500 నోటు తెచ్చుకుంటా: అభిషేక్ సింఘ్వీ
తనకు కేటాయించిన సీటు వద్ద నగదు లభ్యమైందంటూ రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ స్పందించారు. రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500 నోటు తీసుకెళ్తుంటానని ఆయన చెప్పారు. ‘‘ నిన్న (గురువారం) మధ్యాహ్నం 12:57 గంటల సమయంలో నేను పార్లమెంట్‌కు చేరుకున్నాను. మధ్యాహ్నం 1 గంట సమయంలో సభలో ఆందోళన జరుగుతోంది. ఆ సమయంలో నేను క్యాంటీన్‌కు వెళ్లి 1:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. అయోధ్య ప్రసాద్‌తో కలిసి క్యాంటీన్‌లో ఉన్నాను. ఆ తర్వాత పార్లమెంట్ నుంచి వెళ్లిపోయాను. కానీ మీరు నా పేరు ప్రస్తావించారు’’ అని అభిషేక్ మను సింఘ్వీ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.