దిల్లీలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి ఓటమి తప్పదని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 70 స్థానాలకుగాను, బీజేపీ కూటమికి 51 నుంచి 60 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 40 నుంచి 44 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ గరిష్ఠంగా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని తేలింది.
టైమ్స్ నౌ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీ-మార్క్ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 39 నుంచి 49 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 42 నుంచి 50, ఆప్‌నకు 18 నుంచి 25, కాంగ్రెస్ సున్నా నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
చాణక్య స్ట్రాటర్జీస్ బీజేపీ కూటమి 39 నుంచి 44 స్థానాల్లోనూ, ఆప్ 25 నుంచి 28 స్థానాలు., కాంగ్రెస్ 2 నుంచి 3 చోట్ల విజయం స్థాదిస్తుందని పేర్కొంది. జేపీసీ పోల్ బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆప్‌నకు 22 నుంచి 31, కాంగ్రెస్‌కు సున్నా నుంచి 2, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 35 నుంచి 40, ఆప్‌నకు 32 నుంచి 37, కాంగ్రెస్ గరిష్ఠంగా ఒక స్థానం గెలుస్తాయని తెలిపింది. దిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మైండ్ బ్రింక్ కూడా ఆప్‌నకు 44 నుంచి 49, బీజేపీ కూటమికి 21 నుంచి 25, కాంగ్రెస్‌కు సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న వెల్లడి కానున్నాయి.