తెలంగాణలో 2022తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఆయన శుక్రవారం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సైబర్ నేరాలు గత ఏడాదితో పోలిస్తే 17.59 శాతం పెరిగాయన్నారు. 1,108 జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 73 అత్యాచార కేసులలో 84 మందికి జీవిత ఖైదు శిక్ష పడినట్లు తెలిపారు.
2023లో రాష్ట్రంలో 1,360 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 15.6 శాతం అధికమన్నారు. 2,52,60 కిలోల గంజాయి, 1,240 గంజాయి మొక్కలను సీజ్ చేసి.. 2583 మందిని అరెస్ట్ చేశామన్నారు. 1,877 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 59 డ్రగ్స్ కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశామన్నారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్‌ను అరెస్ట్ చేశామన్నారు.