అల్లూరి జిల్లా, పెదబయలు, (ది రిపోర్టర్ ): జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని ఉపాధి హామీ పథకం ఏపీడి గిరిబాబు అన్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం రూఢకోట కొరవంగి పంచాయతీ మారుమూల గ్రామాలలో మంగళవారం ఆయన పర్యటించి ఉపాధి హామీ పనుల పనితీరును పరిశీలించారు. ఉపాధి హామీ పనులలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా..! బినామీల పేరుతో మాస్టర్లు వేస్తున్నారా..! ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందుతున్నాయా.. తదితర విషయాలపై ఆరా తీశారు.రూఢకోట కొరవంగి పంచాయతీ మారుమూల గ్రామాలలో కూలీలు ఉపాధి హామీ పనులను చక్కగా వినియోగించుకుంటున్నారని అన్నారు. ఆర్వో. ఎఫ్.ఆర్ పట్ట కలిగిన ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తున్నామని, కూలీలు పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, మహేష్, సింహాచలం, రూడకోట, కొరవంగి ఫీల్డ్ అసిస్టెంట్లు బోడయ్య పడాల్, రాజబాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.