ప్రయోగాత్మక శిక్షణ విద్యార్థులకు వారి రంగంపై లోతైన అవగాహనను కల్పిస్తుందని, సంప్రదాయ విద్య అందించని విస్తృత అవగాహన, నెపుణ్యాలను అందజేస్తుందని రికీ గ్లోబల్ ట్రేడింగ్ సీనియర్ టెక్నికల్ సేల్స్ మేనేజర్ డాక్టర్ నవీన్ కుమార్ కొట్రక్కి అన్నారు. రికీ గ్లోబల్ వ్యవస్థాపకుడు సంజయ్ సి. మెహతాతో కలిసి గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం ‘ఫార్మా విద్యార్థులకు అవకాశాలు- విశ్లేషణాత్మక ఇంటర్ సిస్ శిక్షణ’పై ప్రసంగించారు.
రికీ గ్లోబల్ నిర్వహిస్తున్న మూడు నెలల శిక్షణ వివరాలను డాక్టర్ నవీన్ తెలిపారు. క్రోమాటోగ్రఫీలో విశ్లేషణాత్మక పరికరాలపై సమగ్ర శిక్షణ ఉంటుందని, ప్రయోగాలు, చేస్తూ నేర్చుకోవడంపై గణనీయమైన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు తమ నెపుణ్యాలను, విశ్వాసాన్ని సింపొందించుకునేందుకు, వాస్తవ ప్రపంచ దృశ్యాలలో సిద్దాంతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ప్రశంసా పత్రం కూడా అందజేస్తామని, బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగం పొందడానికి అది వీలు కల్పిస్తుందన్నారు. తద్వారా ఆయా కళాశాలలు, నిశ్వవిద్యాలయాలకు ప్రాంగణ నియామకాల సంఖ్య పెరగడానికి కూడా దోహదపడుతుందని డాక్టర్ నవీన్ అభిప్రాయపడ్డారు..
తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్ అతిథులను స్వాగతించి, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రికీ గ్లోబల్ శిక్షణ కోసం గీతం ఫార్మసీ విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గతాడి శ్రీకాంత్ సమన్వయం చేశారు.