మంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ పార్క్ రోడ్డుపై మద్యం మత్తులో సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్ఐ ఆవుల తిరుపతి, ఆయన స్నేహితులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై మద్యం తాగుతూ.. చాలాసేపు రోడ్డుపై హల్ చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేస్తుండగా బెజ్జంకి ఎస్ఐ తిరుపతి, ఆయన ఫ్రెండ్స్.. ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్, హోంగార్డుకు గాయాలు కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత బెజ్జంకి ఎస్ఐ తిరుపతి, అతడి ఫ్రెండ్స్.. కారు వదిలి పారిపోయారు. గాయపడ్డ పోలీసుల ఫిర్యాదుతో ఎస్ఐ తిరుపతి, ఆయన ఫ్రెండ్స్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. బెజ్జంకి ఎస్ఐ తిరుపతి స్వస్థలం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వెంపల్లి.