తెలంగాణలోని నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేస్తామని అన్నారు. గత 10 ఏండ్లు గా టీచర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన 2, 3 లక్షల మందికే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ (Mega DSC) నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో(Teacher Transfers) ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.