కొందరికి స్వల్ప విరామంతో ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. కొందరు ఎప్పుడు చూసినా చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. ఇలా తరచూ ఏదో ఒకటి నమిలే అలవాటుతో పళ్లకు ఏదైనా ముప్పు ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. తరచూ ఏదో ఒకటి తినే అలవాటు పళ్లకు రక్షణ పొర ఎనామిల్ దెబ్బతినేందుకు దారితీస్తుంది. ఈ రక్షణపొర బలహీనపడడంతో పళ్లకు పుచ్చులు ఏర్పడతాయి. ఇది మరింత ముదిరితే అప్పుడు దవడ నొప్పి, దవడ లాగడం ఇతర సమస్యలు కనిపిస్తాయి.
తరచూ తినే అలవాటుతో పళ్లల్లో ఆహార శేషాలు ఇరుక్కుపోతుంటాయి. అవి పాడై పళ్లల్లో పుచ్చులు ఏర్పడడానికి కారణం అవుతాయి. నిజానికి ఆహారం నమలడం సాధారణ ప్రక్రియ. ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు ఇది అవసరం. నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. పళ్లను, చిగుళ్లను ఈ లాలాజలం రక్షిస్తుంది. అదే తరచూ తినే అలవాటుతో దవడ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.
మనలో కొందరికి ఐస్, పెన్నులు, గట్టిగా ఉన్న క్యాండీలను కొరికే అలవాటు ఉంటుంది. దీంతో పళ్లపై ఉన్న అనామిల్ పలుచబడుతుంది. ఇది పుచ్చులు పెరిగే రిస్క్ ను పెంచుతుంది. సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది. తీపి, అసిడిక్ స్వభావం ఉన్నవి నమలడం వల్ల (క్యాండీలు, సిట్రస్ పండ్లు) పళ్లల్లో పుచ్చులకు దారితీస్తుంది. చక్కెర హానికారక బ్యాక్టీరియా వృద్ధికి సాయపడుతుంది. దీనివల్ల పళ్లు పాడవుతాయి. అందుకని చక్కెర పదార్థాలు తీసుకోకూడదు.
మార్గాలు..
తీపిలేని పదార్థాన్ని నమలడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి, యాసిడ్స్ న్యూట్రల్ గా మారుతుంది. పళ్లకు రక్షణ ఏర్పడుతుంది. చక్కెర లేని చూయింగ్ గమ్ తీసుకోవచ్చు. దీనికితోడు రోజులో రెండు సార్లు బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్ తో పళ్ల మధ్య చిక్కుకున్న అవరోధాలను తొలగించుకోవడం చేయాలి. అలాగే పదార్థం తిన్న ప్రతిసారీ నీటితో నోటిని పుక్కిలించుకోవాలి. దీనివల్ల పళ్లల్లో ఇరుక్కుపోయినవి బయటకు వచ్చేస్తాయి.