contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ ల పై ఈసీ వేటు

Election Commission Transferred IAS and IPS Officers: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు ముగ్గురు ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు వేసింది. బదిలీ అయినవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అటు ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి. జాషువా, అనంతపురం ఎస్పీ కేకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్​పై బదిలీ వేటు వేసింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి. పాలరాజును కూడా బదిలీ చేసింది.

ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై వేటు వేశారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్​ను ఎన్నికల సంఘం పంపింది. వేటు వేసిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ముగ్గురు చొప్పున పేర్లను కమిషన్​కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఎందుకు నిర్లక్ష్యం వహించారు ? – హింసాత్మక ఘటనలపై ఎస్పీలకు ఈసీ సూటిప్రశ్న – EC questioned district SPs

ఆ ముగ్గురిపై వేటు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ఎన్నికల సంఘం ఆగ్రహించింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీలతో సమావేశమైన ఎన్నికల సంఘం హింసాత్మక ఘటనలపై వివరణ సైతం కోరింది. అయితే అప్పటి నుంచి వారిపై చర్యలు ఉంటాయని ఊహాగానాలు బయటకు వచ్చాయి. దీంతో తాజాగా వారితో పాటు పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​లపై చర్యలు తీసుకుంది.

ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంపై చర్యలు: అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమి, జిల్లా ఎస్పీ అన్బురాజన్​పై బదిలీ వేటు వేసింది. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులతో వీరిని బదిలీ చేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా పట్టించుకోని వైనంపై గతంలో ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కలెక్టర్ గౌతమి ఓటర్ల జాబితాలో అక్రమాలను పట్టించుకోవడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గౌతమి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరి ఎమ్మెల్యేలకు బంధువు అవుతారని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు.

అనంతపురం ఎస్పీ ఎస్పీ అన్బురాజన్​ బదిలీ: వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీ మీద కడపలో పని చేస్తున్న సమయంలో అన్బురాజన్ అక్రమ కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా అధికార పార్టీ నాయకులకు అనంతపురం జిల్లాలో అనుకూలంగా పని చేస్తున్నారని అతనిపై ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్న వ్యవహారాలన్నింటినీ పరిశీలించి ఎస్పీ అన్బురాజన్​పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :