హైదరాబాద్ : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బాలకృష్ణను తొలగించడానికి అవసరమైన న్యాయపరమైన సలహాలను MAUD ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
కాగా.. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి ఎస్. బాలకృష్ణకి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది అనిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అధికారులు తెలిపినట్లు ఆయనకు అన్ని ఆస్తులు లేవని అందులో పేర్కొన్నారు. అనిశా చెప్పే లెక్కలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయని తెలిపారు. బాలకృష్ణ ప్రతి ఏటా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. మరోవైపు బాలకృష్ణను పది రోజుల కస్టడీకి కోరుతూ అనిశా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంది.
అనిశా అధికారులు గత బుధవారం నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా రూ. 100 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. గతంలో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరో వైపు ఎంఏయూడీలో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కొనసాగారు.
హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనలన్నీ ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు సమాచారం. నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి.