contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రమ దోపిడీపై పెనుగర్జన మేడే

మేడే’ కార్మిక పోరాట దినం. 1886లో చికాగో కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8గంటల పనిదినం హక్కును సాధించారు. 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ 8 గంటల పనిదినం హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురయ్యి నేడు పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సంస్థలు కార్మికుల శక్తిని విపరీతంగా దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కార్మికుడు దోపిడీ రూపాలను కార్మిక వర్గం గుర్తించకుండా ఎక్కువ పనిగంటలు తప్పనిసరి అని కార్మికుడే భావించేలా సామాజిక స్థితిని, ఉద్యోగ అభద్రతను కల్పిస్తున్నారు. కార్మికుడి శ్రమనే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయేలా ఉద్యోగ పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కును కోల్పోతున్నది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించేవారు కాదు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. శ్రమను మరవడానికి కాస్తా విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రికులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాల నిర్మాణం, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు చేసుకొని పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఈ పోరాటంలో ఎంతోమంది మరణించి తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

1923లో తొలిసారిగా భారత్‌లో ‘మేడే’ను పాటించారు.. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతనం మొదలైంది. ప్రస్తుతం అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

మేడే హక్కును అణిచివేస్తూ..
చికాగోలో కార్మికులు సాధించిన 8 గంటల పనిదినం ‘‘మేడే’’ హక్కు ప్రైవేటీకరణ, సరళీకరణ మూలంగా మొత్తంగా కార్మికవర్గానికి 8 గంటల పనిదినం దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలను అణచివేసిన సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు కొడుతున్న దళారి, బూర్జువా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుగా మారి ‘మేడే’ హక్కును అణచివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఎంతో త్యాగంతో పోరాడి 8 గంటల పనిదినం సాధిస్తే నేడు 12 గంటలుగా, 16 గంటలుగా పనిదినాలను పొడిగిస్తున్నారు. కార్మిక చట్టాలను బలహీనపర్చడానికి 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం నుండి నేటి వరకు మన దేశ రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నేడు అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం పూర్తిగా బలైన స్థితి కొనసాగుతూ వస్తోంది. అసంఘటిత రంగంలో కార్మికుడు చనిపోతే, ఆ ప్రాణానికి వెలగట్టి మూడోకంటికి తెలియకుండా శవాన్ని బయటికి తరలించే మెకానిజాన్ని అన్ని ప్రైవేటురంగ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలోకి ఎవరూ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడంతో నిజాలు లోపలే బందీ అవుతున్నాయి. మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలవంతంగా యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారాన్ని బంధువులు తీసుకోవాలని భయపెట్టి వారు తీసుకునేలా చేసి, నిశ్శబ్ధంగా వలస కార్మికుల శవాలను రాష్ట్ర పరిధులు దాటించేస్తున్నారు.

1947 ప్రాంతంలో అప్పుడు రాజకీయాలు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవి. అవి నేడు పూర్తిగా రాజకీయంగా మారి, రాజకీయమే ‘వ్యాపార సరుకు’గా మారిపోయిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, ప్రజల జీవించే హక్కు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కార్మిక చట్టాల సవరణలతో 8 గంటల పనిదినం ఉనికిలో లేకుండా పోతున్నది. పెరిగిన పనిగంటలకు కార్మికులు సిద్ధపడితేనే వారికి జీవనోపాధి హక్కు దొరుకుతుంది లేకపోతే, ఉద్యోగాలుండి తొలగించే అధికారాన్ని కూడా ఈ సవరణ ద్వారా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు పొందగలుగుతున్నారు. ఇక సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం యొక్క స్థితి రేపు రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకునే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి, ఈ కార్మిక చట్టాల సవరణల ప్రక్రియ ద్వారా పనిగంటల పొడిగింపు వంటి నిరంకుశ విధానాలకు చట్టబద్ధత చేకూరుతున్నది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :