- విశాఖలో ఘరానా మోసం బయటపడింది.
- పోలీస్ ఎస్సై డ్రెస్ వేసుకుని.. జనాలకు మస్కా కొడుతూ ప్రేమజంట మోసాలకు పాల్పడింది.
- పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను బురిడీ కొట్టించింది ఈ జంట..
- అమ్మో ఏకంగా రూ.3 కోట్ల వరకు వసూళ్లు చేసింది.
- ఆపై వీళ్ల అసలు రంగు బయటపడడంతో బాధితులు..
- ఈ కిలాడీ జంటపై కేసు పెట్టగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
అసలు స్టోరీ ఏంటి అంటే…
పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ SI హనుమంతు రమేష్ , అతడి ప్రియురాలు యువకులకు ఆశ చూపించారు. వారి మాటలు నమ్మి కొందరు నిరుద్యోగులు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఈ కిలాడీ జంట ఎస్సై గెటప్‌లో హల్‌చల్ చేయడంతో వారంతా.. ఈ కపుల్ నిజమైన పోలీసులని నమ్మేశారు. ఆ తర్వాత వారి అసలు రంగు బయటపడడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు.. ఆధారాలు సేకరించగా నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్క్‌ఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. పోలీసుల విచారణలో రమేష్ కేవలం ఉద్యోగాల పేరుతో మోసాలే కాకుండా.. బొమ్మ తుపాకీ పెట్టుకొని పలువురిని బెదిరించి వసూళ్లకు కూడా పాల్పడినట్టు విచారణలో తేలింది. మరింత సమాచారం కోసం ఇద్దరినీ రహాస్యంగా ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. కాగా హనుమంతు రమేష్‌కు ఇప్పటికే పెళ్లై.. ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా.. ఇప్పుడు మరో ప్రియురాలితో సహజీనవం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెను కూడా తన మోసాలకు పావుగా వాడుకుని.. చాలామందికి శఠగోపం పెట్టాడు.