విజయవాడలోని కేపీనగర్‌లోగల టీవీఎస్ వాహనాల షోరూంలో గురువారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూంలోని మూడు వందల వరకూ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాల షో రూంతో పాటూ సర్వీస్ సెంటర్, గోడౌన్ కూడా ఇదే ప్రాంతంలో ఉండటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు దగ్ధమైనట్టు తెలుస్తోంది.
తొలుత షోరూం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు చూస్తుండగానే గోదాముకూ విస్తరించాయి. మరోవైపు, అక్కడి భద్రతా సిబ్బంది తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఫ్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూం నిర్మించడం, గోదాములో ఎలక్ట్రిక్ట్ వాహనాలు కూడా ఉండటం, పెట్రోల్ వాహనాలకు సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పెట్టడం తదితర కారణాలతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.