విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్నవారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తేలింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోట్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు.
ఇదిలావుండగా ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయి ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి నష్టాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.