నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ఉంచనుంది. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా విజన్ ను ప్రోత్సహించేలా పారిశ్రామిక వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కనుందని, ఎంఎస్ఎంఈ లకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉండనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, ఉభయ సభలలో బడ్జెట్ పై సుదీర్ఘంగా 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉందని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30న బడ్జెట్ ను సభలు ఆమోదించే అవకాశం ఉందని తెలిపాయి.
సోమవారం ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వేపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేలా, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంలా ఆర్థిక సర్వే ఉందని చెప్పారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ సర్వే ప్రతిఫలించిందని వివరించారు.