అడవిని రక్షించాల్సిన అధికారులే అడ్డగోలుగా అడవి దొంగలకు అండగా ఉంటున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం జయంతిరామ పురం ప్రాంతంలో అటవీ సంపదను యథేచ్ఛగా అమ్ముకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అటవీ శాఖాధికారులు ప్రధాన రోడ్లకే పరిమితమయ్యారు. గ్రామాలకు వెళ్లి అడవులను ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. అడవిలో చెట్లను యథేచ్ఛగా నరికివేస్తుంటే పట్టించుకోని అధికారులు.. పట్టా భూముల్లో చెట్లను నరికి అమ్ముకుంటున్న రైతులపై తమ ప్రతాపం చూపుతుంటారు. కలప అక్రమ రవాణా పేరిట రైతులకు వేల రూపాయల అపరాధ రుసుం విధించి వేధిస్తుంటారు.
అంతేకాక కొందరు వినుకొండ డివిజన్ ఫారెస్ట్ అధికారులు కాంట్రాక్టు వర్కర్స్ కి జీతాలు ఇవ్వకుండా, పదివేలు జీతం కి బదులు నాలుగు వేలు, ఆరు వేలు జీతం కట్ చేసి ఇస్తున్నట్టు, అంతేకాక జీతబత్యాల విషయంలో కూడా కొందరు విధులనుండి తొలగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్టు వర్కర్స్ కి జీతాలు ఇవ్వకుండా వారి కడుపు పై కొడుతున్నారు. ప్రభుత్వం నుండి వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వినుకొండ డివిజన్ ఫారెస్ట్ అధికారులకు ఇదేం బుద్దని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పల్నాడు జిల్లా పరిధిలో అటవీ సంపదను కాపాడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.