ఖమ్మం ఈర్లపూడి: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి.పోడు సాగుకు అడ్డొస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.