contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన

జకార్త: ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫుడ్‌ అండ్‌ ఎనర్జీ సెక్యూరిటీ మీద కీలక ప్రసంగం చేశారాయన. ఆ సమయంలో ఉక్రెయిన్‌ పరిణామంపై స్పందించిన ఆయన.. కాల్పుల విరమణ, దౌత్యవేత్తం దిశగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత శతాబ్దంలో.. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ తర్వాత.. శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ సమయంలో ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతను నిర్ధారించడానికి.. ఖచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడం అవసరం. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో(భారత్‌లో జరగబోయే సమావేశాన్ని ఉద్దేశించి..) G20 సమావేశమైనప్పుడు.. మనమంతా ప్రపంచ శాంతి అనే బలమైన సందేశం తెలియజేయడానికి అంగీకరిస్తామని నేను విశ్వసిస్తున్నా.. అంటూ ఆయన సలహా పూర్వక ప్రసంగం కొనసాగించారు. అలాగే..

ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి పరిణామాలు ప్రపంచ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం చూపెట్టాయని, ప్రపంచం మొత్తం మీద ఈ సంక్షోభం కొనసాగుతోందని, ముఖ్యంగా దాదాపు అన్ని దేశాల్లో పేదలకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇక భారత్‌లో ఆహార భద్రతను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్‌ కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభావవంతమైన గ్లోబల్ బ్లాక్‌ భారత్‌ తరపున.. అన్ని ముఖ్యమైన సమస్యలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషి చేయడం జరుగుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

అంతకు ముందు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తిరిగి పట్టాలెక్కించడం, ఆహార, ఇంధన భద్రత తదితర కీలకాంశాలపై పలువురు దేశాధినేతలతో లోతుగా చర్చస్తానని బాలి పర్యటనకు బయల్దేరే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పలు రంగాల్లో భారత్‌ సాధించిన అద్భుత ప్రగతి, గ్లోబల్‌ వార్మింగ్‌ తదితర ప్రపంచ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని జీ 20 వేదికపై ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్‌ సారథ్యంలో జరిగే జీ20 సదస్సుకు ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్‌ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో విడిగా భేటీ కానున్నారు. అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్, షీ జిన్‌పింగ్, ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :