కరీంనగర్ జిల్లా : చిగురుమామిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ లకు సొంత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల చిగురుమామిడి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జెడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్ హర్షం వెలిబుచ్చారు. చిగురు మామిడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో జడ్పిటిసి సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో గ్రామపంచాయతీ పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. గ్రామపంచాయతీ సమావేశాలకు, రికార్డుల భద్రతకు, పరిపాలన నిర్వహణకు కేంద్రమైన గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం, శిధిలావస్థలో ఉండడం, అద్దె భవనాలలో నడిపించడం గ్రామ సర్పంచ్ లకు ఇబ్బందిగా ఉండేది. ఒక్కక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు చొప్పున కేటాయిస్తూ అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ఏర్పాటుకాబోతున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్రములో గ్రామ పంచాయితీలను బలోపేతం చేస్తూ ఎస్ ఎఫ్ సి గ్రాంట్ మంజూరు, పల్లె ప్రగతి పేరుతొ పారిశుద్యం, హారిత హారం, ట్రాక్టర్ల పంపిణి వంటి కార్యక్రమాలు చేపట్టారు. పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంపు, ప్రతీ గ్రామపంచాయితీకి పంచాయితీ కార్యదర్శిని నియమిస్తూ పరిపాలన సౌలభ్యాన్ని పెంచారు. అంతేగాక గ్రామ గ్రామాన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రక్రుతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు బాటలు వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదేనని అన్నారు. మండలములో పది నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపి రెండు కోట్లు మంజూరు చేయించిన శాసన సభ్యులు వొడితెల సతీష్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశములో రైతు బంధు జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, బిఆర్ఎస్ మండల అనుబంధ సంస్థలు ఎస్సి సెల్ అధ్యక్షులు బెజ్జంకి అంజయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ సర్వర్ పాషా, పట్టణ శాఖ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, జిల్లాల్ల నాంపెల్లి, చిట్టెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.