చిత్తూరులో ఓ దొంగ పట్టపగలు.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ బయట ఉన్న పోలీసు జీపును ఎత్తుకుపోయాడు. వన్‌టౌన్ స్టేషన్‌కు చెందిన రక్షక్ వాహనం సోమవారం మధ్యాహ్నం చోరీకి గురైంది. అది ఎప్పుడూ స్టేషన్ బయటే ఉంటుంది. సోమవారం తాళం కూడా వేయలేదు. దీన్ని గమనించి అరగంటపాటు అక్కడే తచ్చాడిన ఓ యువకుడు అటూఇటూ చూసి జీపు ఎక్కి సులభంగా స్టార్ట్ చేసి.. దర్జాగా ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసు జీపు కావడంతో సరిహద్దుల్లో ఎవరూ ఆపలేదు. వాహనం మాయమైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు కంగుతిని సీసీ ఫుటేజీ చూసి తమిళనాడు వైపు తీసుకువెళ్లినట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు దిండివనం ప్రాంతంలో అటకాయించి సదరు జీపు సహా దొంగను పట్టుకున్నారు. దీంతో చిత్తూరు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు._
