- గిరిజనుల జీవన విధానంలో వారపు సంత ఒక ప్రత్యేకం
- వారపు సంతలో గిరిజనుల సందడి వాతావరణం
- ఈ సంతలోనే బంధువులతో ముచ్చట్లు, ఆప్యాయతలు, పలకరింపులు
అల్లూరి జిల్లా , ది రిపోర్టర్ న్యూస్ (దేవీపట్నం): దట్టమైన అడవులు ప్రకృతి సోయగాలు గోదావరి అందాల నడు ఒంపుల్లో ఇమిడి ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దేవిపట్నం గ్రామం.ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు గిరిజనలు.
ఇక్కడి గిరిజనుల జీవన విధానంలో వారపు సంత ఒక ప్రత్యేకమని చెప్పవచ్చు. దేవీపట్నం మండల ప్రధాన కేంద్రంలో వారంలో ఒకరోజు ఈ వారపు సంత గిరిజనుల సందడితో కళకళలాడుతూ సందడి వాతావారణం నెలకొనేది. చుట్టూ ప్రక్కల ఉన్న గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించి కొండపోడులో పండించిన పంటలను సంతలో అమ్ముకొని వారానికి సరిపడా వారికి కావాల్సిన నిత్యవసర వస్తువులను కొనుక్కుంటూ జీవించేవారు. ఇక్కడి గిరిజన సంత పండుగ వాతావరణం తలపించడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.
చుట్టాలు బంధువుల మధ్య ఆప్యాయ పలకరింపులతో పులకరించిపోయేది ఈ గిరిజన సంత. సంత చేసిన తరువాత చెట్ల వద్ద సేదతీరుతూ కష్ట సుఖాలను నెమరు వేసుకుంటూ ఒకరికి ఒకరు నేనున్నానంటూ భరోసానిస్తూ ఇళ్లకు వెళ్లేవారు. అయితే నేడు ఈ గిరిజన సంత కనుమరుగయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దేవిపట్నంతో పాటు కొన్ని గ్రామాలు ముంపుకి గురయ్యాయి. ముంపుకి గురైన గ్రామాలకు పునరావాస కాలనీలను ప్రభుత్వం గిరిజన ప్రాంతంలోనే నిర్మించి వారిని తరలించడం జరిగింది. ఇక్కడ గిరిజనులు తరలి వెళ్లడంతో వారపు సంత కనుమరుగయ్యింది.
ఆదివాసీల జీవన విధానంలో దూరమైన వారపు సంతను ఇక్కడి గిరిజనులతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆదివాసీ గిరిజనుల సందడితో గిరిజన సంతను ఏర్పాటు చేయాలని పలువురు ఆదివాసీ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.మైదాన ప్రాంత సంతల్లో అమాయక ఆదివాసీ గిరిజనులు మోసపోయే అవకాశాలు ఉన్నందున ఇక్కడి గిరిజనుల మధ్య గిరిజన ప్రాంతంలోనే గిరిజన సంత ఏర్పాటుకు నాయకులు అధికారులు కృషి చేయగలరని ఆదివాసీలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.