మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.
