Hyderabad : విద్యను ప్రయోగత్మకంగా, స్వీయ అనుభవాన్ని పెంపొందించేలా నేర్చుకుంటే అది విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు దోహదపడుతుందని, వారిని ఆయా రంగాలలో నిపుణులుగా తీర్చిదిద్దుతుందని రాఫ్ట్ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లయిడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘చికిత్సలో ఔషధాలను వాడేటప్పుడు అంతర్ద`ష్టులు-భావోద్వేగాలు’ అనే అంశంపై సోమవారం రెండు రోజుల కార్యాచరణ ఆధారిత వర్క్ షాపును ప్రారంభించారు.
రాఫ్ట్ ప్రతినిధులు మానసిక శాస్త్ర విద్యార్థులను పది మందిని ఒక జట్టుగా విభజించి, మానవ చిక్కులు, డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ తో గైడెడ్ ఇమేజరీ, భావ ప్రకటనా నైపుణ్యాలు, పాత్ర పోషణ, కౌన్సెలింగ్ లో సూక్ష్మ నైపుణ్యాలు, స్వీయ-ప్రతిబింబ చక్రం, ఆశ్చర్యకర అంశాలు వంటి కార్యకలాపాలలో వారిని నిమగ్నం చేశారు. ఇందులో పాల్గొనే వారికి ఆచరణాత్మక కౌన్సెలింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి, భావోద్వేగ ప్రతిబింబాన్ని మెరుగుపరచ డానికి, వ్యక్తుల మధ్య సంభాషణ కొనసాగించేలా దీనిని రూపొందించారు.
మంగళవారం సాయంత్రం వరకు నిర్వహించనున్న ఈ కార్యశాలలో ప్రియమైన వ్యక్తికి, పెంపుడు జంతువుకు లేదా వారు కోల్పోయిన వ్యక్తికి లేఖ రాయడం ద్వారా, వారి భావోద్వేగ విడుదల ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా వివరించడంతో పాటు ఆచరణాత్మకంగా వివరిస్తారు. ఈ కార్యశాల వారిపై చూపిన ప్రభావాన్ని కూడా అంచనా వేస్తారు.
మానసిక శాస్త్ర విద్యార్థులు ఈ కార్యశాలలో ఆసాంతం ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని, చికిత్సా పద్ధతులపై విలువైన అంతర్ద`ష్టులను పొందుతున్నారు. ఈ వర్క్ షాపును మానసిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ దుర్గేష్ నందినీ, డాక్టర్ శ్రీ స్నిగ్ద దిట్టకవి సమన్వయం చేస్తున్నారు.