పనిచేసే చోట మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం’ ఇతివృత్తంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ గురువారం నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ప్రాముఖ్యతను చాటి చెప్పారు.
మానసిక ఆరోగ్యం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి బృంద చర్చలు, వక్తృత్వ పోటీలు, విలువలను చాటి చెప్పే ప్రదర్శనలు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఓ చలన చిత్ర ప్రదర్శనతో పాటు స్వాంతన చేకూర్చే మాటల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటిలో పాల్గొన్న వారికి రోజువారీ జీవితంలో, ముఖ్యంగా కార్యాలయంలో మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతపై లోతైన అవగాహనను కల్పించారు.
‘మానసిక స్థితిస్థాపకతను నిర్మించడం: కళాశాల నుంచి కెరీర్ కు పరివర్తనలో వృద్ధి చెందడం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఉడాన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రియాంక శర్మ, ప్రముఖ బహుళజాతి సంస్థ కార్పొరేట్ సైకాలజిస్ట్ దేబన్ విట్టా కహలీ, గీతం అధ్యాపకులు ప్రొఫెసర్ డీఆర్ పీ చంద్రశేఖర్, డాక్టర్ సాకిబ్ ఖాన్, సుబ్బు పేటేటి, డాక్టర్ నవ్య సంకీర్తన, విద్యార్థిని దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చలను ప్రోత్సహించడం, ప్రతిష్టకు మచ్చతెచ్చే వాటిని ముందుగానే నివారించడం, వ్యక్తిగత, వృత్తిపరమైన కార్యకలాపాలలో ప్రజలు ఎదుర్కొనే మానసిక క్షేమ సవాళ్లను ప్రతిబింబించేలా ఇందులో పాల్గొనే వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. వీటిని నిర్వహించడం ద్వారా, గీతం హైదరాబాద్ మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థలపై అవగాహన పెంచే ప్రపంచ ఉద్యమానికి తనవంతు చేయూతను అందించింది.