గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 24 వరకు ‘సైబర్ సెక్యూ రిటీ వారోత్సవం-2024’ను బెంగళూరులోని వేమన ఇన్-స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో నిర్వహించనున్నారు. బెంగళూరులోని సైబర్ సెక్యూరిటీ ఎస్టీసీ, ఐ ట్రిపుల్ ఈ కంప్యూటర్ సొసైటీల సౌజన్యంతో, వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ రంగంలో విద్యార్థుల జ్జానం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా నిర్దేశించు కున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ నిరంజన్ అప్పస్వామి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
అక్టోబర్ 21న ప్రారంభోత్స వేడుకతో ఆరంభమవుతుందని, ఆ తరువాత హైదరాబాద్-లోని హిటాచీ ఇండియాకు చెందిన విశాల్ కల్లా ‘సైబర్ భద్రతా చర్యలు: డిజిటల్ యుగం కోసం పరిశ్రమ అంతర్దృష్టులు, పరిష్కారాలు’ అనే అంశంపై స్ఫూర్తిదాయక కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. అదే సమయంలో, గురురాజ్ దేశ్-పాండే వేమన ఇన్-స్టిట్యూట్లో ‘చిన్న బగ్-ల నుంచి ప్రధాన ఉల్లంఘనల వరకు: సైబర్ దాడి కథనాలు’ అనే అంశంపై ప్రసంగించి, వాస్తవ ప్రపంచ సైబర్ సెక్యూరిటీ సవాళ్లపై లోతైన అవగాహనను కల్పిస్తారన్నారు. అదే రోజు మధ్యాహ్నం ‘బిగ్ సైబర్ ఇన్ఫర్మేటిక్స్’పై ఫోరెన్సిక్ కార్యశాలను ప్రొఫెసర్ ఎస్.దిలీప్ నిర్వహిస్తారని డాక్టర్ నిరంజన్ తెలియజేశారు.
అక్టోబర్ 22న, ‘సెక్యూర్ ఐడియాథాన్’ పేరిట పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు పురస్కారాలను అందజేస్తారని, దీనికి ఎటువంటి రుసుము లేదని, అయితే పేర్ల నమోదు తప్పనిసరని అన్నారు. ఇక ఈ వారోత్సవాలకే తలమానికం లాంటి ‘సెక్యూర్ హాక్’ పేరిట 24 గంటల హ్యాకథాన్ అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, మరునాడు రాత్రి 12 గంటలకు ముగుస్తుందని తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలుంటాయని, ఐ ట్రిపుల్ ఈ జట్లకు నామమాత్రపు (రూ.70) రుసుము, ఇతరులు రూ.100 చెల్లించి తమ జట్ల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
సైబర్ భద్రత యొక్క సంక్లిష్టతలపై అవగాహన ఏర్పరచడానికి, తరువాతి తరం సైబర్ సెక్యూరిటీ నిపుణులను ప్రేరేపించడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ నిరంజన్ వివరించారు.
ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం https://linktr.ee/homepage.cyberweek లింక్-ను సందర్శించాలని, లేదా 81230 33210ను సంప్రదించాలని సూచించారు.