- 2024-25 బ్యాచ్ ప్రారంభోత్సవంలో గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ కృష్ణ
ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ సిట్యూట్ సౌజన్యంతో, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో నిర్వహిస్తున్న బీ.ఆప్తోమెట్రీ కోర్సుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గీతం సైన్స్ స్ డీన్ ప్రొఫెసర్ కే.ఎస్. కృష్ణ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం బీ. ఆప్తోమెట్రీ బ్యాచ్ ను సోమవారం ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. పర్యావరణ వ్యవస్థ, అందులో వస్తున్న మార్పుల కారణంగా కంటిపై ప్రభావం పడి దృష్టి లోపానికి దారితీస్తోందన్నారు. మానవ శరీరంలోని ముఖ్యమైన భాగాలలో కన్ను ఒకటని, దానిపై లోతైన అవగాహన బీ.ఆప్తోమెట్రీ కోర్సు ద్వారా లభిస్తుందని ప్రొఫెసర్ కృష్ణ చెప్పారు. ఈ కోర్సును అభ్యసించే విద్యార్థులంతా భౌతిక శాస్త్రంలో, మరీ ముఖ్యంగా ఆప్టిక్స్ లో మంచి పట్టు సాధించాలని సూచించారు. కంటి సంరక్షణలో వినూత్న ఆవిష్కరణలను చేయడానికి కాంతి లక్షణాలు-ప్రతిబింబం, వక్రీభవనం, విక్షిపం-వెనుక ఉన్న శాస్త్రంలో లోతుగా అవగాహన ఏర్పరుచుకోమంటూ విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు. నుంచి ఆత్మవిశ్వాసంతో, ఉన్నతాశయంతో ఈ నాలుగేళ్లు కష్టపడమని బీ. ఆప్తోమెట్రీ విద్యార్థులకు ప్రొఫెసర్ కృష్ణ సలహా ఇచ్చారు.
బీ.ఆప్తోమెట్రీ కోర్సు నూతన విద్యార్థులను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ సిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత్ భరద్వాజ్ స్వాగతించారు. ఈ కోర్సులో క్లినికల్ టెక్నికల్ తో పాటు కఠినమైన విద్యా శిక్షణ ఉంటుందని, నైపుణ్య శిక్షణ ఎల్వీ ప్రసాద్, విద్యా సంబంధ జ్ఞానం గీతమ్ లో లభిస్తుందన్నారు. ఈ ఏడాది ఆప్తోమెట్రీ వందవ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని, గత శతాబ్ద కాలంలో ఈ వృత్తి చాలా బాగా అభివృద్ధి చెందినట్టు ఆయన చెప్పారు. కేవలం కళ్ల అధ్యాలను సూచించడమే గాక, రోగుల సంరక్షణలో ఆప్తోమెట్రీ విద్యార్థులు ముందుండటమే గాక, అనేక రకాల పరిస్థితులను నిర్ధారించడం, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంగా ప్రొఫెసర్ శ్రీకాంత్ అభివర్ణించారు.
ఈ ఇండక్షన్ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కు చెందిన డాక్టర్ విజయ్ కుమార్, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.రెజా, కార్యక్రమ సమన్వయకర్త -భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం తదితరులు పాల్గొన్నారు. క్లినికల్ ప్రాక్టీస్, పరిశోధన, ప్రజారోగ్యం, కంటి సంరక్షణలో ఆవిష్కరణలతో సహా విభిన్న కెరీర్ మార్గాలను వక్తలు పునరుద్ఘాటించారు.