విజేతలకు లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు
హైదరాబాద్ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 5-6 తేదీలలో ‘టెక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత్ ఆర్.ముదిమెల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఐనోటీ హ్యాకథాన్’, ‘రిమోట్ కంట్రోల్ కార్ రేస్’లను నిర్వహిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
హ్యాకథాన్స్ జిజ్ఞాస ఉన్న ప్రతిభావంతులను ఒకచోట చేర్చి, వారి ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, కొత్తవారితో పరిచయాలు ఏర్పరచుకోవడం, ఒకరి నుంచి నురొకరు నేర్చుకోవడానికి నీలుగా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 30 గంటల నిడివితో సాగే ఈ ఉత్కంఠభరిత కార్యక్రమంలో సమస్య గుర్తింపు, దానిని పరిష్కరించే కోడ్ రాయడం, ఆచరణీయమైన, సరళీకృత పరిష్కారాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు, ఒక్కో బృందంలో ఒకటి నుంచి నలుగురు సభ్యులుండాలని, వారికి ఐదు సమస్యలనిస్తామని, అందులో ఒకదానిని పరిష్కరించాలని పేర్కొన్నారు. విజేతలకు రూ.50 వేలు, ద్వితీయ విజేతకు రూ.25 వేల నగదు
పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను ఇస్తామని డాక్టర్ ప్రశాంత్ తెలియజేశారు.
‘రిమోట్ కంట్రోల్ (ఆర్.సీ) కార్ రేసింగ్’ అనేది ఒక ఆహ్లాద, ఉత్తకరమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొనేవారు ఇతర ఆటగాళ్లతో పోటీపడేందుకు రిమోట్ నియంత్రిత కార్లతో, అవరోధాలతో కూడిన ట్రాక్లో కార్లను నడపాల్సి ఉంటుందన్నారు. వెర్డ్స్ కార్లను బ్యాటరీతో నడపాలని, తక్కువ సమయంలో పోటీని పూర్తిచేసిన వారిని విజేతలు ప్రకటించి, రూ.15 వేలు, రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు.
ఆయా పోటీల నిబంధనలు, పేర్ల నమోదు, వసతి తదితర వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్తలు మోహన్ సిద్ధేశ్వర్ (9000 2726 32), సాకేత్ (630 160 2726)లను సంప్రదించాలని, లేదా toleeehyd@gitam.in కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.