సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పరిశ్రమల ద్వారా కేటాయించబడిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) నిధులను స్థానిక గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం కోరారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో జరిగిన సమావేశంలో, ఎమ్మెల్యే పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు మండలాల్లో ఉన్న వందలాది పరిశ్రమలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సి.ఎస్.ఆర్ కింద గ్రామ అభివృద్ధికి సమర్పిస్తున్నాయని తెలిపారు.
ఈ నిధులు స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, పరిశ్రమలకు భూములు అందించిన స్థానిక గ్రామాల ప్రజలు అభివృద్ధి దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. దీంతో, పరిశ్రమలు ఉన్న గ్రామాలలోనే సి.ఎస్.ఆర్ నిధులను ఖర్చు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక, కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రాక పోవడం వల్ల పరిస్థితులు తీవ్రంగా దుస్థితి చెందుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.